Bharath Today

Around the World

ఎమ్మెల్యే రోజా వార్నింగ్‌

హైదరాబాద్‌: నెల రోజుల్లో బెల్ట్‌ షాపులను రద్దు చేస్తామని ఏపీ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మంగళవారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ… బెల్ట్‌ షాపులను రద్దు చేస్తామని మూడేళ్ల క్రితం సంతకం చేశారని, ఇప్పటి వరకు ఆ సంతకానికి విలువ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎంత అసమర్థుడో దీన్ని బట్టే అర్థమవుతుందన్నారు. మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి ఊరురా బెల్ట్‌ షాపులు తీసుకొచ్చారని, చంద్రబాబు ‘ఫాదర్‌ ఆఫ్‌ బెల్ట్‌ షాప్స్‌’గా మారారని దుయ్యబట్టారు.

రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళల జీవితాలతో చెలగాటం ఆడారని విమర్శించారు. కోటయ్య కమిటీ కోతల కమిటీగా మారిందని వ్యాఖ్యానించారు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని మోసగించారని, పెన్షన్ల విషయంలోనూ వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. అన్న క్యాంటీన్లు, ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకాలకు దిక్కులేకుండా పోయిందన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్టే పథకాలను కూడా నీరుగారుస్తున్నారన్నారు. చంద్రబాబుకు కావాల్సింది ఖజానా నిండడం కాదు, కమీషన్లు రావడమన్నారు. ప్రజలకు ఏమైనా చంద్రబాబుకు పట్టదన్నారు.

ప్లీనరీలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలతో చంద్రబాబులో చలనం వచ్చిందని, అందుకే బెల్ట్‌ షాపులు రద్దు చేస్తామని చెప్తుతున్నారని వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ నవరత్నాల హామీతో చంద్రబాబు నవనాడులు చిట్లిపోయాయని ఎద్దేవా చేశారు. 10 రోజుల్లో బెల్ట్‌ షాపులు రద్దు చేయకపోతే తామే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. జనావాసాల్లో పెట్టిన మద్యం షాపులను వదిలిపెట్టబోమన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

అబద్ధాల్లో చంద్రబాబు పీజీ చేస్తే, లోకేశ్‌ పీహెచ్‌డీ చేశాడని పేర్కొన్నారు. 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారని, 37 నెలలుగా నిరుద్యోగులకు చేసిందేమీ లేదని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని వెళ్లాలని సూచించారు. చిన్న వర్షానికే సచివాలయంలో నీరు కారడం శోచనీయమని, అధికార పార్టీ అవినీతి ఏవిధంగా కారుతుంతో స్పష్టంగా కనబడుతోందన్నారు.

Updated: October 1, 2017 — 1:25 pm
Bharath Today © 2018 Frontier Theme