• కొబ్బరిచెట్టు పడి ప్రముఖ యాంకర్ మృతి

    Published July 23,2017 , 6:43 PM Posted By andhra

    ముంబైలో ఊహించని ప్రమాదం సంచలనం సృష్టించింది. మహిళను ఓ కొబ్బరిచెట్టు మృత్యువులా వెంటాడింది. మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన ఆమె నెత్తిపై కొబ్బరి చెట్టు ఒక్కసారిగా విరిగి పడిన షాకింగ్‌ ఇన్సిడెంట్‌ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దూరదర‍్శన్‌ మాజీ యాంకర్‌ మరణించిన వైనం తీవ్ర విషాదానికి దారి తీసింది . స్థానిక సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బాధిత మహిళను దూరదర్శన్‌ మాజీ యాంకర్‌ కంచన్‌ రజత్‌ నాథ్‌(58)గా గుర్తించారు. ముంబైలోని చెంబూర్‌ ప్రాంతంలోని శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

    దూరదర్శన్‌ మాజీ యాంకర్‌, యోగ టీచర్‌ కూడా అయిన కంచన్‌ నాథ్‌ గురువారం ఉదయం మార్నింగ్‌ వాక్‌ వెళ్లారు. ఇంటికి సమీపంలో నడుస్తుండగా కొబ్బరిచెట్టు ఒక్కసారిగా ఆమెమీద విరుచుకుపడింది. దీంతో ఆమె చెట్టుకింద పడి నలిగిపోయింది. అకస్మారక స్థితిలోకి జారుకున్న ఆమెను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. తీవ్ర గాయాలతో శనివారం ఉదయం మృతి చెందారని కంచన్‌ భర్త తెలిపారు. ఈ విషాదంపై ఆమె కుటుంబ సభ్యులు ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. పాడైపోయి.. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్టు కొట్టివేయడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో బీఎంసీ అనుమతి నిరాకరించిందని వారు ఆరోపించారు.