కోట్లు ఉంటేనే వైసీపీలో సీట్లు: గిడ్డి ఈశ్వరి

politics

జగన్ పార్టీలో ఇప్పుడిప్పుడే లుకలుకలన్నీ బయట పడుతున్నాయి. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఉన్న బలమైన నాయకులకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించకపోవడంతో పాటు పార్టీలో కానీసం గుర్తింపుకు కూడా నోచుకోక విసిగిపోయి పార్టీ వీడుతున్నారు.

తాజాగా టీడీపీలోకి చేరిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ది డబ్బు సంస్కృతని, డబ్బులతో రాజకీయం చేయవచ్చనే ఆలోచనలో జగన్ ఉన్నాడు అంటూ ఆమె ఆగ్రహం వ్వ్యక్తం చేసారు. డబ్బు ఉన్న వారికే సీట్లు ఇవ్వాలని జగన్ నిశ్చయించుకున్నాడని , అందుకే పార్టీ కోసం కస్టపడి పని చేసిన వారికి ఏ గుర్తింపు లేకుండా చెయ్యడమే కాకుండా కొత్త నాయకులను తీసుకొచ్చి మా సీటుకే ఎసరు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాను ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రజలకు ఏమీ చేయలేకపోయానని ఈశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ జగన్ తీరుపై నిప్పులు చెరిగారు. జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, కోట్లు ఉన్న వారికే సీట్లు ఇస్తామన్న జగన్ మాటలు నన్ను ఎంతగానో బాధపెట్టాయన్నారు.

వైసీపీలో ఉండగా సీఎం, మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలతో ఎవరితోనూ మాట్లాడకూడదనే ఆంక్షలు విధించేవారన్నారు. జగన్ వల్ల అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేకపోయామని, ఇప్పుడు వస్తున్నందుకు ఆనందంగా ఉందని ఈశ్వరి ఆనందంతో చెప్పారు.

జగన్ నన్ను పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేసి నన్ను అవమాన పరిస్తే..చంద్రబాబు నన్ను పార్టీలోకి చేర్చుకుని నా విలువ తగ్గకుండా చేశారన్నారు. గిరిజనుల సమస్యల మీద చంద్రబాబుకి అవగాహన ఉందని అందుకే మన్యం లో
బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయించాడని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మన్యం లో టీడీపీ జెండా రెపరెపలాడించడమే కాకుండా .. పార్టీ అధికారంలోకి తీసుకురావడమే తన ధ్యేయం అని ఆమె ప్రకటించారు.