• మా సీటు ఉంటుందా ఊడుతుందా ? సిట్టింగ్ ఎమ్యెల్యేల్లో కొత్త గుబులు

    Published December 4,2017 , 8:21 AM Posted By andhra

    మా సీటు ఉంటుందా ఊడుతుందా ? సిట్టింగ్ ఎమ్యెల్యేల్లో కొత్త గుబులు

    తెలంగాణా అధికార పార్టీలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో అప్పుడే సీట్ల సర్దుబాటు వ్యవహారం తెరమీదకు వచ్చింది.. ఆపరేషన్ ఆకర్ష్ పేరు తో భారీగా ఇతర పార్టీ నాయకులను చేర్చేసుకున్న గులాబీ పార్టీ ఇప్పుడు చేరిన వారందరికీ టికెట్లు ఏ విధంగా సర్దుబాటు చెయ్యాలో తెలియక ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్యెల్యేలకు పొగ పెట్టాలని చూస్తోంది. దీంతో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్యెల్యేలకు కంటిమీద కునుకే లేకుండా పోయింది. ప్రజల్లోకి వెళ్లి పనిచేయండి.. ప్రజలకు దగ్గరగా ఉండండి. వచ్చే ఎన్నికల్లో సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తా. పనితీరు మెరుగుపరుచుకుంటే ఎలాంటి సమస్యా లేదు. పనిచేసి పేరుతెచ్చుకుంటే చాలు.. అందరికీ టికెట్లు వస్తాయి’… టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ శాసనసభాపక్ష సమావేశాల్లో చెబుతూ వచాడు. కానీ పరిస్థితి చూస్తే మాత్రమ్ అందుకు భిన్నంగా ఉంది.

    పార్టీలో నెలకొన్న పరిణామాలు చూస్తున్న సిట్టింగ్ ఎమ్యెల్యేలకు నిద్ర పట్టడంలేదు. వివిధ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్యెల్యేలు ఉండగా ఆయా పార్టీల నుంచి గతంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారిని ఇప్పటికే పార్టీలో చేర్చుకున్నారు. కొన్ని రోజులుగా ఇంకొంతమందిని పార్టీలో చేర్చుకుని నియోజకవర్గ ఇన్‌చార్జీల బాధ్యతలు కూడా అప్పజెప్పారు. సిట్టింగులకే మొదటి అవకాశం ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తున్నా అది నమ్మశక్యంగా లేదు. పార్టీలోకి ఇటీవల చేరుతున్న వారితో పాటు ఇతర ప్రాంతా నుంచి కూడా నాయకులను తీసుకొచ్చి నియోజకవర్గ ఇంచార్జిలుగా చేస్తుండడం స్థానిక నాయకులకు మింగుడు పడడంలేదు. మహబూబాబాద్‌లో పార్టీ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ ఉండగానే, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే కవితను చేర్చుకున్నారు. ఆమె పార్టీలో చేరి రెండు సంవత్సరాలు అవుతుండగా ఇటీవల పార్టీ, అధికార కార్యక్రమాల్లో ఆమె వేగం పెంచడంతో వచ్చే ఎన్నికల్లో ఆమెకే సీటు ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి.

    ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖా నాయక్‌ ఉండగా, టీడీపీ నుంచి మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ను చేర్చుకున్నారు. వీరి మధ్య సమన్వయం లేక పార్టీ శ్రేణులు చీలిపోయాయి. తాజాగా భూపాలపల్లిలో స్పీకర్‌ మధుసూదనాచారి ఉండగా, టీడీపీకి చెందిన గండ్ర సత్యనారాయణరావును చేర్చుకున్నారు. ఇదే పరిస్థితి దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ నెలకొంది. దీంతో ఎన్నికల నాటికి ఎవరికి శేయీరు దక్కుతుందో ఎవరికి మొండిచెయ్యి చూపిస్తారో తెలియని పరిస్థితి.